ఇంటిపైనే గంజాయి మొక్కల సాగు

ఇంటిపైనే గంజాయి మొక్కల సాగు
  • పట్టుకున్న వరంగల్​ యాంటీ డ్రగ్స్​ టీమ్

వరంగల్, వెలుగు: వరంగల్​ నగరం నడిబొడ్డున ఇంటిపైనే గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని వరంగల్​ పోలీస్​ కమిషనరేట్​ యాంటీ డ్రగ్స్​ టీమ్​ పోలీసులు పట్టుకున్నారు. టీమ్​ఇన్​చార్జి, ఇన్స్​పెక్టర్​ జె.సురేశ్​​తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్​ రైల్వే స్టేషన్​ను ఆనుకుని ఉండే శివనగర్​కు చెందిన పల్లెబోయిన శివకుమార్(60) ఈజీ మనీ కోసం అలవాటుపడ్డాడు. బయట రోడ్ల మీద అరటిపండ్ల వ్యాపారం చేస్తూనే ఫెడ్లర్​గా ఉంటూ గంజాయి సాగులో అడుగుపెట్టాడు.

బయట సాగు చేస్తే జనాలకు అనుమానం వస్తుందని ఇంటినే పరిశ్రమగా చేసుకున్నాడు. బిల్డింగ్​పై పూలకుండీల్లో గత కొన్ని రోజులుగా గంజాయి మొక్కల పెంపకం చేపట్టాడు. కాగా, యాంటీ డ్రగ్స్​ టీమ్​ పోలీసులు మత్తు పదార్థాలను పసిగట్టే విధుల్లో భాగంగా జాగిలాలతో గురువారం వరంగల్​ రైల్వే స్టేషన్​లో తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో వారికి ఈ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతుందని సమాచారం రావడంతో.. జాగిలాలతో తనిఖీ చేయగా శివకుమార్​ ఇంటిపై పూలకుండీల్లో గంజాయి సాగు బయటపడింది. యాంటీ డ్రగ్స్​ టీమ్​ పోలీసులు అతడిని అరెస్ట్​ చేసి మిల్స్​ కాలనీ పోలీస్​ స్టేషన్​లో అప్పగించారు. పోలీసులను  ఉన్నతాధికారులు అభినందించారు.